హిమాలయాలకు వెళ్ళి మంచుపూలను కోసుకొస్తారు కొందరు. రాత్రంతా వేచి ఉండి ఓపికగా పారిజాతాలను ఏరుతారు మరికొందరు. మల్లెల మాసం వచ్చేంత వరకూ ఆగి మొగ్గలను వొడుపుగా గుచ్చి మాల అల్లుతారు ఇంకొందరు. కాని- దారిన పోతూ పోతూ కింద రాలిన ఒక గన్నేరు పువ్వును అందుకొని దేవుని సమక్షాన పెట్టి అంతకు మించి వీలు కాదన్నట్టుగా కదిలిపోతారు మరికొందరు. ఇది అలాంటి ప్రయత్నం. తెలుగు కథ సమక్షంలో ఒక గన్నేరు పువ్వును పెట్టే ప్రయత్నం. వందేళ్ళలో వచ్చిన వంద సుప్రసిద్ధ కథలను ఏరి, వాటిని క్లుప్తంగా తిప్పి చెప్పిన ప్రయత్నం ఇది. కథను చదివే, కథ మొత్తాన్ని చదివే, కథను వెతుక్కుని చదివే వీలు లేని ఈ అడావిడి రోజుల్లో నూరేళ్ళ తెలుగు కథా సాహిత్యాన్ని అలుపు లేకుండా ముగించడానికి వీలుగా చేసిన ప్రయత్నం ఇది. కొండను అద్దంలో చూపించడం. దేశీయ కథా సాహిత్యంలో ఇలాంటి ప్రయత్నం బహుశా కొత్త. ఇది తెలుగు కథ ఘనత. తెలుగు కథకు ఒక కథకుడు ప్రకటించిన కృతజ్ఞత.