-
Tejo Tungabhadra By Vasudendra , Ranganadha Ramachandrarao
అర్ధరాత్రి సమయంలో తేజోనది ప్రవాహించే సవ్వడి తప్ప ఇతర సవ్వడులు లిస్బన్ నగరంలో అంతగా వినిపించవు. కొంచెం చెవులు రిక్కించి వింటే దూరంలో సముద్రపు ఘోష మాత్రం అప్పుడప్పుడు వినిపిస్తుంది. మౌనసరోవరంలో రాయి విసిరినట్టు గంటకొకసారి తప్పనిసరిగా అంతఃపురం గంట సమయం సూచించటానికి చప్పుడు చేస్తుంది. వయసుదాటినవారు ఆ గంట చప్పుడుకు పక్కకు దొర్లుతారు. పిన్నవాళ్ళకు మెలకువ కూడా రాదు. సంవత్సరం నిండిన పసిబిడ్డలు ఒక్కోసారి ఆకలితో మేల్కొని ఏడుస్తారు. తల్లి స్తనం దొరకగానే మిన్నకుండిపోతారు. అంతఃపురంలోని కొన్ని కాగడాలు తప్ప వీధి దీపాలు ఎప్పుడో ఆరిపోయివుంటాయి.
అదొక వానాకాలపు రోజు. సాయంత్రమంతా వాన కురిసి, మొత్తం నగరాన్నంతా తడిపింది. ఆ వర్షానికి బయటికెక్కడికీ వెళ్ళలేని జనం భోజనం చేసి, పీకలదాకా వైన్ తాగి, తొందరగా నిద్రలోకి జారిపోయారు. అంతఃపురం గంట పన్నెండుసార్లు చప్పుడు చేసి ఇంకా పదిహేను నిముషాలు కూడా కాలేదు. ఆ సమయంలో అంతఃపురం వంటింటి కట్టడం వెనుక భాగం నుంచి, ముఖానికి ముసుగు వేసుకున్న ఒక ఆకారం పిల్లిలా అడుగులు వేస్తూ బయటికి వచ్చింది. ఆ ఆకారం అటూ ఇటూ చూస్తూ, ఎవరూ గమనించటం లేదని నిర్ధారించుకుంటూ అంతఃపురం ప్రహరీగోడవైపుకు నడవసాగింది. పొడవాటి గుడ్డలో ఏదో మూట కట్టుకుని, దాన్ని నడుముకు చుట్టుకుంది. అప్పుడప్పుడు దాన్ని ముట్టి చూసుకుంటూ………………..