-
Grahantaravasi
భూమండలం బోరుకొడుతోంది – అని పైకే అనేశాడు. సుందరికి అర్ధం కాలేదు. ఈ మాట ఎందుకన్నట్లు? దీని అర్ధమేమిటి? యితడు పిచ్చివాడా – ఇలా అనేక ప్రశ్నలు సుందరిలో చెలరేగాయి.
స్వాప్నికుడు కలల్లోనే శృంగార వుద్దీపనాన్నీ శృంగార తృప్తినీ పొందుతాడు. వాగ్గేయకారులు తమ స్వప్నాల్ని నేలమీదికి దించి సాకారం చేయడానికి ఇష్టపడలేదు. అందుకే దివ్య ప్రణయ తన్మయత్వంలో మైమరపించే గీతాలని ఆశువుగా పాడారు, ఆడారు. నిజమైన శృంగారం స్వప్నాల్లోనే ఉంది.
శూన్యంలో భూమి వ్యర్థంగా తిరుగుతోంది. వాతావరణాన్ని దాటి రోదసిలోకి పలాయనం చిత్తగించిన వ్యోమగామిలా పట్టి ఉంచేదీ స్పందింపజేసేదీ ఏదీ లేకుండా, ఆకర్షణ శక్తిని కోల్పోయినట్లు నిరర్ధకంగా తిరుగుతోంది.
ప్రతీదీ వ్యక్తీకరింపబడాలి. మనిషి వ్యక్తీకరించలేనిదీ బహిర్గతం చేయలేనిదీ అంటూ ఏదీలేదు. వ్యక్తీకరింపబడినది అతిక్రమించబడుతుంది. మనిషి ఆధీనంలోకి వస్తుంది. మనిషి సృజనాత్మక వ్యక్తీకరణ ద్వారా ప్రపంచాన్ని అధీనంలోకి తెచ్చుకుంటున్నాడు.