-
Raaga Saadhika
స్వర్గ నరకముల ఛాయా దేహళి
చిన్నప్పుడు, ఏ తరగతి పుస్తకంలోనో గుర్తు లేదు కానీ గౌతమబుద్ధుని పాఠం ఉండేది. సిద్ధార్థుడు బుద్ధునిగా మారిన ప్రయాణం చాలా కలవరపెట్టింది. ముఖ్యంగా సిద్ధార్థుడు జర, రుజు, మరణాలను చూసి అశాంతికి లోనై, ఇల్లు వదిలి వెళ్ళిపోవడం నా మనసు మీద చెరపలేని ముద్ర వేసింది.
చిన్నవయసులో ఇ అనేది పిల్లలకి సురక్షిత స్థలం. మేడ అయినా గుడిసె అయినా అది తమని పొదువుకునే చోటు, తమవారుండే చోటు.
ఒక యువకుడు, తల్లిదండ్రులను, భార్యాబిడ్డలను, సురక్షిత స్థలాన్ని వదిలి అసలు ఎందుకు వెళ్ళాడు, ఏమి సాధించాడన్నది నన్ను ఆకర్షించలేదు. ఎలా వెళ్ళగలిగాడన్నదే బాధించింది. అలా వెళ్ళిపోవడానికి కారణమైన వార్ధక్య, అనారోగ్య, మరణాలు సిద్ధార్థుడిని ఏమో గానీ నన్ను చాలా భయపెట్టాయి.
ఒక బొమ్మ వేస్తేనో, ఒక కవిత రాస్తేనో నలుగురికీ చూపడానికి సిగ్గుపడే రోజులవి. ఇక మనసులోని ఆలోచనలు, భయాలు, సంఘర్షణలని బైటకి చెప్పుకోవడానికి ఆస్కారమే లేదు. అసలు చెప్పుకోవచ్చని కూడా తెలీదు.
ముసలితనం వల్ల అనారోగ్యం వస్తుంది, అనారోగ్యం వల్ల చనిపోతారు. ఈ మూడింటికి మనిషి ఉనికి అతుక్కుని ఉంటుంది. ఈ గొలుసుకట్టులో ఎపుడు, ఎవరికి ఏది ఎదురైనా నాకు గుబులుగా ఉండేది.
మనుషులు చావు గురించి మా ఊళ్ళో ఒక వదంతి ఉండేది. ఒక శవం లేస్తే వెంటనే మరి మూడు శవాలు తోడు బోతాయని చెప్పుకునేవారు. పిల్లకాయలంతా శవం ఊరేగింపు చూడటానికి ఎగబడితే నేను లోపలి గదిలోకి పారిపోయేదాన్ని.
ఆ నలుగురు దాటిపోయేకాలంలో ‘అస్తి నాస్తి విచికిత్స’తో మనసు నిండిపోయేది. తచిన్నవయసుకి అన్ని బరువైన ఆలోచనలు ఎలా మోసానో ఇప్పటికీ ఆశ్చర్యమే.
మరణం పెద్ద ప్రశ్నలా చాలా జీవితాన్ని ఆక్రమించింది………………..