-
నామిని ఇస్కూలు పుస్తకం
ఇస్కోలు పిలకాయల కత పిల్లల భాషలో Algebra చదువులా? చావులా?? మా అమ్మ చెప్పిన కతలు పిల్లల్తో మాట్లాడాల్సిన మాటలు.
ఈ పుస్తకం గురించి ఎంతచెప్పిన తక్కువే? ఎంతవ్రాసిన కొరతే. ఇస్కూలులో పాఠాలు చెప్పే ప్రతి లెక్కల అయ్యవార్లు కొని చదువవలసిన పుస్తకమిది. ఇస్కూలను నడిపే యాజమానులు తమ అయ్యవాళ్ళచే చదించవలసిన పుస్తకమిది. ఇస్కూలు కెల్లే పిల్లలున్న ప్రతి అమ్మ, నాయిన ఈ బుక్కును కొని మరీ చదవాలబ్బా!!. ఇస్కూల్లకెల్లి చదువుకునే పిల్లలున్న స్నేహితులకు, హితులకు, చుట్టాలకు, పక్కాలకు, ఇరుగుపొరుగు అమ్మలక్కలకు, అన్నయ్యలకు బహుమతిగా ఇవ్వతగ్గ పుస్తకం. లక్షలకు లక్షలు డొనేసన్ను ఇచ్చాం. వేలకు వేలు ఫీజులు కట్తున్నాం..”బాగా చదవాలి, మంచి ర్యాంకుల పంట పండించాలి. ఇంజనీరో, డాక్టరో అవ్వాలని” పిల్లలను సతపోరే అమ్మనాన్నలు, అయ్యవార్లు స్కూల్లో పిల్లలకు లెక్కలంటే, ఇంగ్లీసంటే భయంలేని విధంగా చెప్తున్నారా? లేదా గుత్తంగా బట్టి పెట్టిస్తున్నారో, గమనించడం లేదు. నామిని ఈ పుస్తకంలో చెప్పిన విషయాలు ఉహించి రాసినది కాదు. ఆయన అనుభవం నుండి, ఆలోచన నుండి, ఆచరణ నుండి పుట్టు కొచ్చినదీ పుస్తకము. తన అక్కకూతురు తులసి, – తన పిల్లలకు, కొన్నిరోజులు స్కూలు పిల్లలకు టిచరుగా పాఠాలు చెప్పిన అనుభవం నుండి, స్కూలుకెళ్ళె ప్రతి పిల్లాడికి లెక్కలన్నా, ఇంగ్లీసన్నా భయం పోవాలన్న తపనకు ప్రతిఫలమే ఈ పుస్తకము. ఈ మధ్య వార్తాపత్రికల్లో చూస్తున్నాం, చదువువత్తిడికి తట్టుకునే మానసికస్ధితి కోల్పొయి ఆత్మహత్యలు చేసుకుంటున్న విద్యార్థుల గురించి. వాటికి సమాధానం ఈ పుస్తకంలోని “చదువులా? చావులా”