-
Gaddi Parakatho Viplavam
దక్షిణ జపానులోని షికోకు దీవిలోని ఓ చిన్న గ్రామంలో ఫుకుఓకా పుట్టాడు. మైక్రోబయాలజీలో శిక్షణ పొంది పంటల తెగుళ్ళ నిపుణుడయ్యాడు. యోకోహామా లో కస్టమ్స్ ఇన్ స్పెక్టర్ గా ఉద్యోగంలో చేరాడు. జీవితం సాఫీగా, ఖుషీగా గడిచిపోతుందను కొంటున్న సమయం లో ఎన్నో ప్రశ్నలు అతన్ని పీడిం చాయి. 25 ఏళ్ళ ప్రాయంలో పొందిన అనుభవం అతని జీవితాన్ని మార్చివేసింది. మానవ ప్రయత్నమంతా వృథా అని అతనికి బోధపడింది. చేస్తున్న ఉద్యోగాన్ని వదిలిపెట్టి పల్లెకు చేరాడు. ఆధునిక వ్యవసాయాన్ని సవాలు చేస్తూ పొలాన్ని దున్నకుండా, ఎరువులు, పురుగుల మందులూ, కలుపునాశిని మందులూ, యంత్రాలూ లేకుండా వ్యవసాయం చేయసాగాడు. ప్రకృతిని సాధ్యమయి నంతగా అనుసరిస్తూ ‘ఏమీ చెయ్యనవసరం లేని’ వ్యవసాయ విధానాన్ని రూపొందించాడు. అతను అవలంబించిన పద్దతుల పల్ల నేల ఏ ఏటికాపడు సారవంతం అవుతూ వచ్చింది. జపానులో మరే ప్రాంతానికీ తీసిపోని దిగుబడులు పొందుతున్నాడు. తన అనుభవసారాన్నంతా ఈ పుస్తకంలో నింపాడు.
ఆహార సంస్కృతి గురించి, ప్రకృతి జీవనం గురించి ఇందులో వివరించాడు. ఇది జపనీస్ భాషలో 1975లో ప్రచురితమయ్యింది. 1976లో ఇంగ్లీషులోకి అనువాదమయ్యింది. ఆ తరువాత దేశ విదేశాల్లో ఎన్నో భాషల్లోకి అనువాదం అయ్యి, ఎన్నో ముద్రణలను పొందింది. వ్యవసాయానికీ, జీవితానికీ, సంస్కృతికీ, మధ్య విడదీయరాని సంబంధం ఉందని ఫుకుఓకా విశ్వాసం ప్రకృతి వ్యవసాయం గురించి తెలుసుకోవాలని ఉన్న ప్రతి ఒక్కరూ చదవదగిన పుస్తకమిది.
రవీంద్రనాథ్ ఠాగూర్ స్థాపించిన విశ్వభారతి విశ్వవిద్యాలయం మసనోబు ఫుకుఓకాకు 1988లో ‘దేశికోత్తమ’ బిరుదునిచ్చి గౌరవించింది. ఆ సందర్భంలో ఆయన హైదరాబాదు కూడా సందర్శించారు. వ్యవసాయం వ్యాపారం కాదు జీవిత విధానమన్న భారతీయ సంప్రదాయానికి జీవం పోసే పుస్తకమిది.