-
మంత్రకవాటం తెరిస్తే మహాభారతం మన చరిత్రే
ప్రతి ఒక్కరూ చదవాల్సిన అసాధారణ రచన!
పదండి చరిత్రలోతుల్లోకి… పదండి తోసుకు!
మహాభారతమూ, అందులోని పాత్రలూ, అవి ఎదుర్కొన్న సమస్యలూ, సంక్షోభాలూ తమను కప్పిన మాంత్రికశైలిని ఛేదించుకుంటూ నేరుగా చారిత్రకవాస్తవికతలోకి ప్రవహిస్తే – ఆ దృశ్యం ఎంత అద్భుతంగా ఉంటుంది!
ఆ అద్భుతత్వాన్ని ఈ పుస్తకంలోని అక్షరక్షరంలో మీరు ఆస్వాదించవచ్చు.
మహాభారత మంత్రకవాటం తెరచి చూపించే పురాప్రపంచాన్ని అంతే ఆశ్చర్యావహంగా దర్శించవచ్చు. భారతీయ, ఇతర ప్రపంచపౌరాణికతల మధ్య సాదృశ్యాలనే కాదు; విశ్వాసాలు, ఆచారాలు, సంస్కృతీసంప్రదాయాల రూపంలో మనం ఊహించుకునే హద్దులు చెరిగిపోయి, ప్రపంచమంతా ఒకటిగా మారిపోయే విలక్షణ సన్నివేశాన్ని విప్పారిన చూపులతో వీక్షించవచ్చు.
సాహిత్య విమర్శకుడిగా, పత్రికారచయితగా, రాజకీయ విశ్లేషకుడిగా, అనువాదకుడిగా, కాలమిస్టుగా, కథా రచయితగా తెలుగు పాఠకులకు పరిచితులైన కల్లూరి భాస్కరం విశిష్ట రచన ఇది.
పురాచరిత్ర, సామాజికతలకు సంబంధించిన అనేకానేకమైన అదనపు కోణాల నుంచి మహాభారతాన్ని వ్యాఖ్యానించే ప్రణాళికలో పూర్వభాగం ఈ పుస్తకం.
ధారావాహికగా వెలువడి అశేషపాఠకులను అలరించిన ఈ రచన, మరిన్ని చేర్పులతో మరింత లోతును సంతరించుకుని ఇప్పుడీ గ్రంథ రూపంలో మీ చేతుల్ని అలంకరిస్తోంది.
మహాభారతంలోని మన చారిత్రక మూలాలను తవ్వి తీసే ఈ అసాధారణ రచన మలిభాగం రూపుదిద్దుకొంటోంది.
-
Ivee Mana Moolaalu
సాహసం, కానీ ఎంతో అవసరం
కల్లూరి భాస్కరం ప్రసిద్ధ పాత్రికేయులని అందరికీ తెలుసు. కాని 1980 తర్వాత తెలుగు కవిత్వంలో వచ్చిన మార్పుని ముందే పసిగట్టిన కవి అని చాలామందికి తెలియకపోవచ్చు. ‘మౌనం నా సందేశం'(1980) పేరిట ఆయన వెలువరించిన కవితాసంపుటి సమకాలిక తెలుగు కవిత్వంలో ఒక వేకువ పాట.
ఆయన చేయి తిరిగిన అనువాదకుడని కూడా కొందరికి తెలియకపోవచ్చు. పి.వి. నరసింహారావుగారి ‘ఇన్సైడర్’కు ‘లోపల మనిషి'(2002) పేరుతో ఆయన చేసిన తెలుగు అనువాదం ప్రశస్తమైన కృషి. అలాగే రామ్మోహన్ గాంధీ రచన ‘మోహన్ దాస్’కు చేసిన అనువాదం(2011) కూడా ప్రశంసనీయమైన పుస్తకం. ఆయన రాసిన ‘కౌంటర్ వ్యూ’ చదివినవాళ్ళకి ఆయన సిద్ధహస్తుడైన కాలమిస్టు అనీ, ‘వేయిపడగలు నేడు చదివితే’ చదివినవాళ్ళకి ఎంతో ప్రతిభ కలిగిన సాహిత్య విమర్శకుడనీ తెలుస్తుంది. తెలుగు కవిత్వంలో కాలికస్పృహ పేరిట ఆయన చేసిన ప్రతిపాదన ఎంతో మౌలికమైనదని చేరాలాంటి వాడే ప్రస్తుతించాడు. ఇక ‘మంత్రకవాటం తెరిస్తే మహాభారతం మన చరిత్రే'(2019) పేరిట ఆయన వెలువరించిన ఉద్గ్రంథం ఆయన్ని సమకాలిక తెలుగు జిజ్ఞాసువుల్లో, పరిశోధకుల్లో అగ్రశ్రేణిలో నిలబెట్టింది.
ఈ బృహధ్రంథాలన్నీ ఒక ఎత్తూ, ఇప్పుడు ‘ఇవీ మన మూలాలు’ పేరిట మీ చేతుల్లో ఉన్న ఈ పుస్తకం ఒక ఎత్తు. ఇది ఒక మల్టి-డిసిప్లినరి అధ్యయనం.
—-ఇవీ మన మూలాలు 7