-
Dargamitta Kathalu & Poleramma Banda Kathalu
చిన్నవాళ్ళని, పెద్దవాళ్ళని, గొప్ప గొప్పవాళ్ళని, ముక్కూ ముఖం ఎరగని చాలా మందిని ఆత్మీయులుగా నాకు చేరువ చేసిన కథల పుస్తకాలివి. ఏ పూట ఏ మూలకు వెళ్ళినా ఆదరించి అన్నం పెట్టే కల్లాకపటం ఎరగని ఎన్నో కుటుంబాల నిచ్చిన పుస్తకాలు. ఒక రకంగా నా ఆస్తిపాస్తులు. వీటిని చదివి, చదువుతూ, ఇది రాస్తున్న ఈ క్షణాన కూడా ఏదో ఒక మూల ఎవరో ఒకరు చదువుతూ నన్ను ఆశీర్వదిస్తూ ఉంటారు. వారి ముఖాన నవ్వు… కంట కన్నీరు… గుండెల్నిండా ఈ కథల పట్ల ప్రేమ… ఇంకా ఏం కావాలి నాకు?
‘దర్గామిట్ట కథలు’ చదివిన పాఠకులు కొందరికి ‘పోలేరమ్మ బండ కథలు’ తెలియవు. ‘పోలేరమ్మ బండ కథలు’ చదివిన కొందరికి ‘దర్గామిట్ట కథలు’ ఉన్నట్టుగానే తెలియవు. ఆశ్చర్యం ఏమిటంటే మొదట ఎవరు ఏది చదివితే అదే ఇంకొకదాని కంటే బాగుందని వాదనకు దిగడం. ఈ తకరారు ఎందుకు? రెండు కలిపి చదువుకుంటే బాగుంటుంది అని ఇలా. నాకెంతో ఇష్టమైన కథలు ఇంకా ఇష్టంగా మీ చేతుల్లో పెడుతున్నాను.
– మహమ్మద్ ఖదీర్ బాబు