-
Yedu Tharalu
“పరిశుభ్రమైన గాలి క్షణమాత్రం సోకితేనే గజగజలాడిపోయే ఊపిరితిత్తులు;;; వొంటి నిండా బట్టలుండవు – మలవిసర్జన జరిగిపోతుంటే శుభ్రం(గా)చేసుకోవటానికి కూడా వీలు లేకుండా కాళ్ళూ, చేతులకు సంకెళ్ళు – పండ్లతో, గాయాలతో, చీము నెత్తురులోడే భుజాలు, మోచేతులు, పిర్రలు;;; పిచ్చలు కోసేయ్యటం – మర్మాంగాలు నరికెయ్యటం – ఎముకలను కరుచుకున్న మాంసం వూడొచ్చేదాకా కొట్టటం, నిండు గర్భిణులను పొట్ట కింద గుంత తవ్వి, బోర్ల పడుకోబెట్టి, కొరడాలతో కొట్టటం, జంతువులను వేటాడాల్సిన వేట కుక్కల చేత మనుషులను వేటాడించటం;;; చర్మాన్నీ, నరాల్ని, కండల్నీ, ఎముకనూ, ఒక్క వేటుతో ఛేధిస్తూ, ఓ గొడ్డలి మొన మన కుడి కాలును మన శరీరం నుండీ వేరు చేస్తుంటే…;;; అవయవాలుండవు; ఉన్నా అవి దొరల కోసం! తోడు లేదు – బిడ్డలు లేరు – సంసారం లేదు – స్వజనం లేరు – స్వగ్రామం లేదు – స్వదేశం లేదు – గతం లేదు – భవిష్యత్తు లేదు;;;” నాగరికత, హక్కుల ముసుగు లో ఓ జాతి మరో జాతి మీద సాగించిన దాష్టీకాలను, ఆకృత్యాలను, అర్ధం చేసుకోవటానికి “ROOTS / ఏడు తరాలు” – (By Alex Haley) ని చదవండి. INDEPENDENCE DAY అంటే హాలిడే కదా ఆడుకోవచ్చు అని ఎదురు చూసే పిల్లల చేతా, లాంగ్ వీకెండ్ ఏమో అని క్యాలెండర్లు వెతికే పెద్ద వాళ్ళ చేతా, ఈ పుస్తకం చదివించండి! స్వాతంత్ర్యం, స్వేచ్ఛ ల విలువేంటో, దాని కోసం మన ముందు తరాల వాళ్ళు ఎన్ని కష్టాలు అనుభవించారో, త్యాగాలు చేసుంటారో, ఎం కోల్పోయారో, కనీసం ఊహించనైనాగలరు !!
Reviewed By Seshumadhav Chaturvedula
విజేతలే చరిత్రను రాస్తారన్న నిష్ఠుర సత్యాన్ని బద్దలుకొట్టి, చరిత్ర పట్ల మన దృక్పథాన్ని సమూలంగా మార్చివేసిన అద్భుత రచన. ఆరు తరాల వెనక అట్లాంటిక్ మహా సముద్రానికి ఆవల ఆఫ్రికా చీకటి ఖండంలో ఉన్న తన వంశం మూలాలు, దాని పుట్టుపూర్వోత్తరాలను వెతికి పట్టుకునేందుకు నల్లజాతి అమెరికన్ రచయిత ఎలెక్స్ హేలీ చేసిన అసాధారణ అన్వేషణ ఫలితమే ఈ పుస్తకం.
‘రూట్స్’ పేరుతో 1976 లో ప్రచురితమైన ఈ రచన అమెరికానూ, యావత్ ప్రపంచాన్నీ పట్టి కుదిపేసింది. నల్లజాతి అస్తిత్వాన్ని ఎలుగత్తి చాటడంలో, జాతి వివక్షపై తిరుగుబాటు జెండా ఎగరెయ్యటంలో కీలకపాత్ర పోషించింది. ప్రపంచ వ్యాప్తంగా 60 లక్షలకు పైగా కాపీలు అమ్ముడుపోయింది. 37 భాషల్లోకి అనువాదమైంది. స్వేచ్చ నుంచి సంకెళ్ళకు, సంకెళ్ళ నుంచి విముక్తికి సాగిన ఈ ప్రస్థానం సినిమాగా, టీవీ సీరియల్ గా కూడా గొప్ప విజయాన్ని సొంతం చేసుకుంది.