-
Thribhujapu Naalugo Konam
విధ్వంస దృశ్యం
ఇరుకిరుకు దారుల్లో నిప్పు కుంపట్ల మధ్య నడుస్తున్నట్టుగా ఉంది. ధరలు భగ్గుమనడమంటే ఏమో అనుకున్నావ్ ఇప్పుడర్థమౌతోంది కదూ! బాగా కమిలి మగ్గుతున్న, కుళ్ళి పులుస్తున్న, మోటారు ఇంధనం కాలుతున్న, శరీరాల చెమట కంపు కొడుతున్న ఘాటు వాసన గంధక ధూమంలా, చెదరని మేఘంలా ఒళ్ళంతా చిరచిరలాడిస్తూ… పండి పక్వానికొస్తున్న తియ్యటి వాసన కదిలీ కదలని పిల్ల తెమ్మెరలా లిప్తకాలం పాటు ముఖాన్ని స్పృశిస్తూ…
గాలి వీచదు, చెమట ఆరదు. అయినా, ముదురుటెండలో మార్కెట్ కని బయల్దేరి పాలిస్టర్ చీర ఎందుకు కట్టుకున్నానా అని ఇప్పుడు వాపోవడం నిజంగా బుద్ధితక్కువ పనే. అదిగో ఆ బెంగాలీ అమ్మాయిని చూసైనా నేర్చుకోవాలి. నీలిపూల తెల్లని కాటన్ ప్రింటెడ్ – మైసూర్ కాటన్ లేదా యూపీ హ్యాండ్లూమ్ వెరైటీ… పెద్దపెద్ద పూలతలు డిజైన్ గా అద్దిన పొడవాటి చీరకొంగు దాదాపు నేలకు ఆనుతూ, ఒత్తయిన నల్లని కురచ జుట్టు పోనీటైల్ ముడి చిన్నగా చెదరుతూ, కొంగుచాటు నీలి జాకెట్ ఎగువ నున్నటి మెడ అక్కణ్నుంచి అవతలివైపు దిగువకు విస్తరించుకుపోయిన వీపు అందంగా బహిర్గతమౌతూ, స్లీవ్స్ జబ్బల దంతపు వర్ణం కాంతి మెడలోని సన్నని బంగారు గొలుసు తళతళలతో పోటీ పడుతూ… నాజూకుగా నడుస్తున్న ఆ సింపుల్బ్యూటీ ఆమె మోస్తున్న ప్లాస్టిక్ బుట్టలో నవనవలాడుతున్న కూరగాయల రాశిలాగే తాజాదనానికి నిలువెత్తు నిర్వచనం. పేరు హేమగాత్రి లేదా సుమగాత్రి అయి ఉండాలి. పాలతో స్నానం చేయించినట్లుగా తెల్లగా మెరుస్తున్న బుల్లికారులో స్టీరింగు ముందు కూర్చున్న యువకుడు డోర్ తెరిచి బుట్ట అందుకుంటూ నవ్వుతూ… దబ్బపండు రంగు నిండు బుగ్గల మీద క్లీన్ షేవింగ్ బాపతు పచ్చని చారలు చిత్రంగా సాగుతూ ఎర్రనినోట్లోని సూపర్వైట్ పలువరుస టి.వి. ప్రకటనల్లోలాగా ఫ్లాష్ ఫ్లాష్… నిజంగా మేడ్ ఫర్ ఈచ్ అదర్. జి.ఎం.గారి అబ్బాయో, చీఫ్ ఇంజనీర్ గారి అమ్మాయో అయి ఉండాలి. దేనికైనా పెట్టి పుట్టాలంటారు! ……………