ఇది గాంధీజిపై నేను రాసిన ఆరవ పుస్తకం. గాంధీజీ పేరు చెప్పేసరికి – సత్యము, అహింస, అనే మాటలతో బాటుగా ఆ రెండింటి సమన్వయంగా వెలువడిన సత్యాగ్రహము అనే మాట కూడా జ్ఞాపకానికి వస్తుంది. మనుషులలోని పరపిడనా ప్రవృత్తిపై మహాత్ముడు ప్రయోగించిన అహింసాత్మక ఆయుధం ఇది.
‘సత్యాగ్రహం’ అనే మాట చాలా మందికి సుపరిచితం కావచ్చునుగాని, ఈ మాటకుగల సంపూర్ణమైన అర్ధం ఏమిటి? దీనిని గాంధీజీ తొలిసారిగా ఎప్పుడు ఎక్కడ ఎందుకు ఉపయోగించారు? గాంధీజీ భారత్ లో మొత్తం ఎన్ని సత్యాగ్రహాలు చేశారు? వాటి ఫలితం ఏమిటి? ఇలాంటి ప్రశ్నలకు సరి అయిన సమాధానాలు చాలా మందికి తెలియవు.
తెలుగులో కొంత గాంధేయ సాహిత్యం వుండవచ్చుగాని ఈ విషయాలకు సంబంధించిన సంపూర్ణమైన అవగాహనకు అవి తొడ్పడవు. మొత్తం భారతదేశ స్వాతంత్ర్య చరిత్రనూ ఏకరువు పెట్టడం వేరు. సత్యాగ్రహ సమరాన్ని వాటి లక్ష్యాలతో సహా, పరిణామాక్రమంతోసహా, వివరించడం వేరు. అవన్నీ గాక గాంధీజీ లక్ష్యం కేవలం ఒక దేశానికి స్వాతంత్ర్యం తేవడం ఒక్కటేకాదనే విషయాన్ని కూడా ఈ సందర్భంలో గుర్తుకు తెచ్చుకోవాలి. ఆయన కోరేది కేవలం స్వరాజ్యం మాత్రమే కాదు. ఆ స్వరాజ్యం సురాజ్యంగా వుండాలని ఆయన కోరుకున్నాడు.
దక్షిణ ఆఫ్రికాలోనయినా, భారతదేశంలోనయినా, ప్రపంచ పౌరుడయిన మహాత్ముని దృష్టి ఒక్కటే. అన్నిదేశాలూ సురాజ్యాలుగా వుండాలనీ, మనుషులందరూ ప్రేమాభిమానాలతో విలసిల్లాలనీ ఆయన కోరుకున్నాడు. అదేకాకుంటే దేశదేశాలకూ ఆయన ఆలోచనలు ఆత్మీయమయ్యేవి కావు. నేటికి స్పూర్తినిచ్చేవికావు.
ఈ విషయాలన్నింటినీ దృష్టిలో వుంచుకుని ముఖ్యంగా యువతరం కోసం ఈ పుస్తకాన్ని రూపొందించడం జరిగింది. విలువలు సన్నగిల్లుతున్న ఈ రోజులలో జనావళికి సరి అయిన లక్ష్యం సమకూరెందుకు, వారిలో పోరాటపటిమ సరి అయినరీతిలో వుండేందుకు, గాంధీజీ గురించి తెలుసుకోవడం అత్యంత ఆవశ్యకం.
– కోడూరి శ్రీరామమూర్తి
కోడూరి శ్రీరామమూర్తి (రచయిత గురించి) :
1941 సెప్టెంబరు 29వ తేదిన రాజమహేంద్రవరంలో జన్మించారు. రచయితగా, సాహిత్య విమర్శకుడిగా, గాంధేయ తత్వపరిశోధకుడుగా, కృషి, ప్రసిద్ధత, వృత్తిరీత్యా మూడున్నర దశాబ్దాలపాటు అర్ధశాస్త్ర ప్రధానోపాధ్యాయుడుగా బొబ్బిలిలోని రంగారావు కళాశాలలో ఉద్యోగం. ఉద్యోగం నుండి విశ్రాంతి పొందిన తర్వాత రాజమండ్రిలో స్థిరనివాసం.
ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారం, ఆంధ్రప్రదేశ్ రవీంద్ర శతజయంతి ఉత్సవ పురస్కారం (1961లో విద్యార్ధిగా వుండగా రాసిన పుస్తకానికి), పులికంటి కృష్ణారెడ్డి పురస్కారం, కృష్ణాపత్రిక గోల్డెన్ జూబిలీ బహుమతి, అరసం పురస్కారం. వీరు పొందిన బహుమతులు.
తెలుగు నవలాసాహిత్యంలో మనో విశ్లేషణ (సాహిత్య విమర్శ), తెలుగు కధ – నాడు, నేడు (సాహిత్య విమర్శ), వెలుగు – వెన్నెల (సాహిత్య విమర్శ), మా మంచి తెలుగు కధ (కధా సాహిత్య వ్యాసాలు), అందాల తెలుగు కధ, తెరతీయగరాదా (కధలు), నీటిలో నీడలు (నవల), రవికవి (బాలసాహిత్యం), ప్రసిద్దుల జీవితాల్లో హాస్య, ఆసక్తికర సంఘటనలు, “గాంధీజీ కధావళి, మనకు తెలియని మహాత్ముడు, మహాత్ముని ప్రస్థానం, ఆలోచన, మరోకోణంలోంచి మహాత్ముడు, బాపూ నడిచిన బాట” – ఇవి గాంధేయ సాహిత్యంపై వెలువడిన రచనలు. ఇవన్నీ కోడూరి శ్రీరామమూర్తి గారి ప్రధాన గ్రంధాలు.
Reviews
There are no reviews yet.