మనకు తెలియని మహిళల ఆత్మకథ
పాశికంటి (బల్ల) సరస్వతిగారు తన 69వ యేట (2012) మొదలు పెట్టి తన 76వ యేటకు (2019) పూర్తి చేసిన ఆత్మకత ‘కలెనేత’. ఒక బహుజన (పద్మశాలి), తెలంగాణ ఉపాధ్యాయురాలు రాసిన రెండవ ఆత్మకథ. సుమారు అటుయిటుగా నూటా ఇరువై సంవత్సరాలు ఏడుతరాల నేతపనివారి గెలుపోటముల విషాద విధ్వంసక పోరాట చరిత్ర… ‘కలెనేత’లో సరస్వతిగారు నాలుగోతరం ప్రతినిధి. భారతదేశంలో జాతీయోద్యమ పోరాటం, తెలంగాణాలో రైతాంగ సాయుధ పోరాటం రూపుదిద్దుకుంటున్న కాలంలో సరస్వతిగారు నడక నేర్చుకున్నారు. అక్కడి నుండి ఒక మహిళగా, ఉపాధ్యాయురాలిగా తన జీవితాన్ని, తన బతుకు చుట్టూ విస్తరించి యున్న గ్రామీణ జీవితాన్ని తార్కికంగా అర్థం చేసుకున్నారు… మూడు తరాలు వెనక్కి తన తల్లిదండ్రులైన పాశికంటి రామదాసు, లక్ష్మమ్మలను – తాత వీరయ్య – అతని తండ్రి ధర్మయ్యదాకా లోపలికి వెళ్లారు. అక్కడి నుండి 2019 దాకా తను, సాగిన జీవనయానం – దాని చుట్టూ విస్తరించి ఉన్న జీవితాన్ని అంటే మరో మూడు తరాల సమకాలీన జీవితాన్ని ఆత్మకథలో చిత్రించారు. తెలంగాణా సాయుధ పోరాటం ఉధృతంగా నడిచిన ఆలేరు, జనగామ, వరంగల్లు, నల్గొండ ప్రాంతాలు – అక్కడి గ్రామాలు, చిన్న పట్టణాలు ఈ ఆత్మకథలో కన్పిస్తాయి.
ఇదే ప్రాంతం నుండి ఇంతకన్నా ముందు ముదిగంటి సుజాతరెడ్డిగారు ‘ముసురు’ అనే పేరుతో ఆత్మకథగా రాశారు. సుజాతారెడ్డిగారు ఉపాధ్యాయురాలే. నకిరేకల్ (నల్గొండ) నుండి కరీంనగర్ దాకా అదే పోరాటకాలంలో దొరల జీవన నేపథ్యంలో రాశారు. తెలంగాణాలో బహుజన మహిళ సంఘం లక్ష్మీబాయమ్మ రాసిన మొట్టమొదటి
ఆత్మకథ ‘నా అనుభవములు’. ఈ ఆత్మకథను కాంగ్రెస్ రాజకీయాల నేపథ్యంలో రాసారు. తెలంగాణాలో పురుషులు రాసిన ఆత్మకథలు… సామల సదాశివ ‘యాది’, దాశరథి రంగాచార్య ‘జీవన యానం’, దాశరథి కృష్ణమాచార్య ‘యాత్రాస్మృతి’, కాళోజీ ‘నా గొడవ’, బోయి భీమన్న ‘పాలేరు నుండి పద్మశ్రీ వరకు’, పి.వి. నర్సింహారావు ‘లోపలి మనిషి’, రావినారాయణరెడ్డి స్వీయచరిత్రము’ రాశారు.
ఈ మూడు మహిళల ఆత్మకథలు తెలంగాణా మహిళా సాహిత్యంలో (సుమారుగా ఏడువందల నవలలు వచ్చినా కూడా) ప్రామాణికంగా నిలుస్తాయి………….
బల్ల సరస్వతి
Reviews
There are no reviews yet.