వివాహాల్లో విచిత్ర హత్యలు
రాత్రి పదీ ముప్ఫై రెండు అయింది. కమలా కళ్యాణ మండపం వందలాది అతిథులతో క్రిక్కిరిసి వుంది. ముందువరసలో వున్న సోఫాలో నేనూ పార్వతీ కూర్చున్నాం. ఎలక్ట్రిట్ లైట్లు ప్రకాశవంతంగా వెలుగుతున్నాయి. పురోహితుడు మంగళసూత్రాన్ని నా దగ్గరకు తీసుకొచ్చాడు. నేనూ పార్వతీ ముట్టుకుని రాజేశ్వరి దాంపత్య జీవితం నాలుగు కాలాలపాటు సుఖంగా సాగాలని దీవించాం. రాజేశ్వరి బి.ఎస్.సి. పాసయింది. నా మిత్రుడు కమలాకర్రావు కూతురు, పురోహితుడు మంగళసూత్రాన్ని తతిమ్మా పెద్దల వద్దకు తీసుకు వెళ్ళాడు.
నిముషాలు గడుస్తున్నాయి. పెద్దల అరుపులు, పిల్లల కేకలు, బయట రోడ్డుమీద కారు హారన్లు వినిపిస్తున్నాయి. వుడ్బైన్ సిగరెట్ వెలిగించాను. పురోహితుడు మా ముందున్న పెళ్ళి పీటవద్దకు వెళ్ళాడు. మంగళసూత్రాన్ని పెళ్ళికొడుక్కి అందించాడు. పురోహితుడు మంత్రాలు చదువుతున్నాడు. పెళ్ళికొడుకు లేచాడు. కాస్సేపట్లో బాజా భజంత్రీలు రణగొణధ్వనులు చెయ్యసాగాయి. పెళ్ళికొడుకు మంగళసూత్రాన్ని కట్టడానికి ముందుకి వంగాడు. ఢాం అని పిస్టల్ పేలింది!
మరుక్షణంలో ఎందరో పరుగెడుతూన్న బూట్ల చప్పుడు వినిపించాయి. సోఫాలోంచి లేచాను. నలువైపులా చూశాను. చటుక్కున లైట్లు ఆరిపోయాయి. కమలా కళ్యాణమండపాన్ని చీకటి తెరలు కప్పేశాయి.
ఏవో అరుపులు, ఏడ్పులు, పరుగెడుతూన్న బూట్ల చప్పుళ్ళు, పార్వతిని దగ్గరగా లాక్కున్నాను. జేబులోంచి టార్చితీశాను. టార్చికాంతిలో పెళ్ళి పీటవైపు చూశాను. అక్కడ అనేకమంది గుంపులుగా నిలబడ్డారు. గబగబా అటు నడిచాను. బలంగా అతిథులను తోసుకుంటూ లోపలకు జరిగాను.
టారి కాంతిలో పెళ్ళిపీట మీద వెల్లకిలా వెనక్కి పడిపోయిన రాజేశ్వరి కనిపించింది. గొంతు ప్రాంతంలో రక్తం విశేషంగా చిమ్ముతోంది. ముందుకు వంగి ఆమె నాడిని పరిశీలించాను. రాజేశ్వరి చనిపోయిందని వెంటనే గ్రహించాను. లేచి నిలబడ్డాను. చుట్టూ చీకటి. ఆ అంధకారంలో నా కంఠం గంభీరంగా మ్రోగింది. “ఎవ్వరూ కదలకండి! మండపం గేట్లు మూసివేయండి!”…………………..
Reviews
There are no reviews yet.