చారెడేసి కన్నులు, చేమంతి బంతులు
ముంగురుల ముద్దుమోము – మనస్సు నిలువనీయదే
బావికాడ కడవతో వయ్యారపు నీ నడక
గుండెపట్టి గిల్లిందే-ఒళ్ళు తిమ్మిరెక్కిందే
నా వంక చూడవా నడుమొంపు చిన్నదాన
ఒక్క నవ్వు నవ్వవా రంగపూరు నెరజాణ
ఇవ్వాళో రేపో విరిగిపోయేటట్లున్న చెక్కబల్లమీద ఎడమచేత్తో దరువు వేస్తూ పెద్ద గొంతుతో పాడటం మొదలు పెట్టాడు గంగారాం.
మాట్లాడేటప్పుడు మహా కరుకుగా ధ్వనిస్తుంది అతని కంఠం.
పాటలు మొదలు పెట్టిన మరుక్షణం మార్దవంగా మారిపోతుంది.
తలలు వంచుకుని తమదారిన తాము వెళ్ళిపోవాలనుకునే వారుకూడా ఆగిపోవాల్సిందే. పాట పూర్తి అయ్యేవరకూ ఆగి విని తీరాల్సిందే.