భారతదేశాన్ని మహర్షులు జన్మించిన పుణ్యభూమిగా అభివర్ణించుకుంటారు. హరిశ్చంద్రుడు, ధర్మరాజు మొదలైన సత్యవ్రతులు, శ్రీ కృష్ణుడు శ్రీరాముని వంటి అవతార పురుషులు ఈ పవిత్ర స్థాలీనే పుట్టారు. ప్రపంచవ్యాప్తంగా తియోసాఫికల్ సందేశాన్ని వినిపింపజేయడానికి పూనుకున్న మాడమ్ బ్లావేట్స్ కి , ఈ దేశపు ఆధ్యాత్మిక ఔన్నత్యం గుర్తించినందువల్లనే, తన సొసైటీ హెడ్ క్వార్ట్ర్స్ ను భారతదేశంలోని మద్రాసు అడయార్ లో నెలకొల్పింది. నేను ఎదో సందర్భంలో అమెరికా దేశం వెళ్ళినపుడు అక్కడి దివ్యజ్ఞాన సమాజ సభ్యులను కొందర్ని కలిశాను: ఎదో పుణ్యబలం చేతనే వ్యక్తులు ఇండియాలో జన్మించి, ఆ విధంగా భారతదేశంలోని ఉత్తమ మత సంస్కృతికి వారసులై వుంటారని వారి అభిప్రాయంగా కనిపించింది. ఇక్కడి వేదాలను, ఉపనిషత్తులను మాక్స్ ముల్లర్, రోమరోలా, హర్ మాన్ కినార్లింగ్ ప్రభృతులు వేనోళ్ళ కొనియాడారు.