మన తెలుగులో సినీ పరిజ్ఞానం గూర్చి తెలుసుకోవాలనుకున్న వారికి పుస్తక రూపంలో ఏ సమాచారమూ లభించదు. ఈ లోపం చిత్ర రంగ ప్రారంభదశ నుండి మనలను వెంటాడుతూనే ఉంది. కారణమేమిటంటే మొదటి నుండి మనకున్న సాంకేతిక నిపుణులు వాళ్ళ అనుభావాలను గ్రంథస్తం చేయలేకపోయారు. అనుభవజ్ఞుడు వ్రాయలేడు. వ్రాయగలిగిన వారికి సాంకేతిక నైపుణ్యం తెలియదు. ఈ ఇబ్బంది వలన మన తెలుగు సినీ రంగంలోని దర్శకులు, సాంకేతిక నిపుణులు తమ అనుభవాలను తమలోనే అణచివేసుకున్నారు.
నేను ‘నటసోపానం’ అనే నట సాంకేతిక సిద్ధాంత గ్రంథం వ్రాసిన తరువాత చాలా మంది మిత్రులు మన తెలుగులో స్క్రీన్ ప్లే, దర్శకత్వం గూర్చిన సమాచారం ఇసుమంతైనా లేదు. ఆ కొరత తీర్చగల్గే బాధ్యత తీసుకోమని నన్ను ప్రోత్సహించడంతో ఈ చిన్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టాను. కళా రంగంలో తమ కలలను సాకారం చేయదలచుకొన్న వారు తప్పని సరిగా నటసోపానం చదివి తీరాలి. ఎందుకంటే అందులో కళలకు సంబంధించిన సమస్త సమగ్ర సంపూర్ణ సమాచారం వాదించిన విస్తరిలా ఉంది. ఒక నటుడు జీవితాంతం శ్రమపడి నేర్చుకున్న అనుభవసారం కంటే ఒక్క నటసోపానం, ఎన్నో రెట్లు గురువు రూపంలో మీకు సాంకేతిక సంస్కారం బోధిస్తుంది ఇది వాస్తవం.
ఈ చిన్న పుస్తకంలో రెండు గొప్ప విషయాల గురించి వివరించడం జరిగింది. ఒకటి స్క్రీన్ ప్లే, రెండు డైరెక్షన్. ఈ భాగాలలో పరిపూర్ణమైన జ్ఞానం సంపాదించలేనివాడు కథను ప్రేక్షకామోదంగా చిత్రించలేడు. చిత్ర రంగంలో నాకున్న అనుభవం కొంచమేనని చెప్పలేను. అపారమని అంతకన్నా చెప్పలేను. కాని నేను రచించిన ఈ చిన్న పుస్తకం వర్ధమానులను ఉత్తమ విలువలు గల స్క్రీన్ ప్లే రైటర్స్ గా, డైరెక్టర్స్ గా తీర్చి దిద్దగలదని క్లాప్ కొట్టి మరీ చెప్పగలను.
Reviews
There are no reviews yet.