ఈ పుస్తకంలో, కధలూ – వ్యాసాలతో పాటు ఇంకా ఏ యే విషయాలున్నాయో అవన్నీ ‘విషయ సూచిక’ లోనే తెలుస్తాయి. దానిలో వున్న 2,3 విషయాల గురించి, కొంచెం చెప్పాలని ఈ ముందు మాట!
కధల్లో, 2వ కధ ‘సుమ ప్రేమ కధ’, ఇందులో వున్న కధా వస్తువు కొంత కొత్తదే! ఇటువంటి వస్తువుని నేనెక్కడా చదవలేదు. కొన్ని ప్రాంతాల్లో ఆహారాల అలవాట్లు ఫలానా రకంగా తేడాలుగా ఉంటాయని తెలుసు. కానీ ఇది తెలిసింది కొన్నాళ్ళ కిందట! అప్పటి నించీ ఆ వస్తువుతో ఒక కధ రాయాలని ఆలోచన! సుమకి జరిగినట్టే, నా వయసులో నాకు జరిగి వుంటే, నేను కూడా సుమ లాగే ప్రవర్తించేదాన్ని అనుకుంటాను. అలా అనుకుంటున్నాను గానీ, అలాగే జరిగేదో లేదో! ఈ కధ ‘స్వాతి’ మాస పత్రికలో మొదట వచ్చినప్పుడు, ఈ కధ కొందరికి నచ్చడమూ, కొందరికి నచ్చక పోవడమూ, రెండూ జరిగాయి. ఇతర కధలకు కూడా, నచ్చడాలూ – నచ్చక పోవడాలూ జరుగుతూనే వుంటాయి. కానీ ఈ ‘సుమ కధ’ విషయంలో మాత్రం, 2 రకాలూ గట్టిగా కనపడ్డాయి. నాకైతే, ఈ కధ చాలా నచ్చింది. నేను రాశాను కదా అని కాదు; ఆ వస్తువుని బట్టి!
– రంగనాయకమ్మ
Reviews
There are no reviews yet.