శ్రీపురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు “నీలి” కథతో దేశంలోనూ శ్రీ పాలగుమ్మి పద్మరాజు గారు “గాలివాన” కథతో ఇతర దేశాల్లోనూ తెలుగు కథకి మంచి పేరు సంపాదించిన తరవాత తెలుగు సాహిత్యంలో కథానిక ముందడుగు వేసిందని నేను తలుస్తున్నాను. కొత్త కొత్త రచయితలు కొత్త కొత్త దార్లంట వెళ్ళి, కొత్త సంగతులు కనుక్కున్నారు. అంతే కాదు చాలా మందికి తెలియని పాత సంగతుల్ని కూడా బైటికి తీసుకు వచ్పేరు. తెలుగు కథ విస్తరించింది. మధ్య తరగతి వారి గురించి కథలు వస్తున్నప్పటికీ ఇతర వర్గాల వారి గురించి కూడా కథలు వస్తూనే వున్నాయి. జీవితంలోని వైవిధ్యాన్ని ప్రతిబింబించడానికి తెలుగు కథ ప్రయత్నిస్తుందని నేను అనుకుంటున్నాను. అయితే, జీవితంలో ముఖ్యమైన అధర్మం ఒకటుంది. అదేమిటంటే ఒక జీవిని మరొక జీవి చంపుకు తినడం. చంపి తినడం అనేది జీవితంలో ముఖ్య విశేషం. ఈ లోకాన్ని భగవంతుడలా సృష్టించేడు కాబట్టి, ఒకరు మరొకర్ని చంపుకు తినడంలో తప్పు లేదని వాదించేవారిని కదిలించి చూస్తే చాలా మంది ఉంటారు. –
ఇతర ప్రాణుల్ని పూర్వపు మానవులు వేటాడి చంపి తినే వారు. ఇప్పుడు వాటిని పెంచి చంపి తింటున్నాం . తేడా పెద్దగా ఏమీ లేదు. అయితే ఇతర ప్రాణుల్ని మనం చంపి తింటున్నప్పటికీ కూడా మనల్ని మనం చంపుకోకూడదు తినుకోకూడదు అనే ఆలోచనలోకి మానవులం కొంత వరకూ వచ్చేమని చెప్పుకోవచ్చును. కాని అందులో కూడా నిజాయితీ లేదు. బలహీనుల్ని బలవంతులు చంపుతూనే ఉన్నారు. చంపకపోతే, దోచుకుంటూనే ఉన్నారు.
Reviews
There are no reviews yet.